కళారత్న, ఉగాది అవార్డుల విజేతల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్

  • వివిధ రంగాలకు చెందిన 164 మంది ప్రముఖులకు సత్కారం
  • మార్చి 19న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రదానం
  • కళారత్న అవార్డుకు రూ.50 వేలు, ఉగాది పురస్కారానికి రూ.10 వేలు నగదు బహుమతి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న (హంస)’, ‘ఉగాది పురస్కారాలు-2026’ విజేతల జాబితాను ప్రకటించింది. సాహిత్యం, కళలు, జర్నలిజం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. మార్చి 19న విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

 ఈ పురస్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో దరఖాస్తులను ఆహ్వానించగా, 2వేలకుపైగా దరఖాస్తులు అందాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వీటిని పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేసింది. మొత్తం 164 మందికి (40 కళారత్న, 124 ఉగాది) పురస్కారాలు ప్రకటించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కళారత్న (హంస) పురస్కారం కింద రూ. 50వేల నగదు, హంస ప్రతిమ, ప్రశంసాపత్రం అందిస్తారు. ఉగాది పురస్కారం గ్రహీతలకు రూ. 10వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.

కళారత్న పురస్కారానికి ఎంపికైన వారిలో సాహిత్యం నుంచి మన్నవ సత్యనారాయణ (గుంటూరు), నాగభైరవ ఆదినారాయణ (ప్రకాశం), జర్నలిజంలో పప్పుల దేవదాస్ (గుంటూరు), సామాజిక సేవలో జాష్టి రంగారావు (పల్నాడు) వంటి ప్రముఖులు ఉన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Chandrababu Naidu
AP Ugadi Awards 2026
Kalaratna Awards
Andhra Pradesh Government
Mandali Buddha Prasad
Literary Awards India
Journalism Awards
Social Service Awards
Ugadi Celebrations
Vijayawada

More Telugu News